క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2027 వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ ఖరారైంది. 24 ఏళ్ల విరామం తర్వాత ఆఫ్రికా ఖండం ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు కలిసి అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 వరకు ఈ పోటీలను నిర్వహించనున్నాయి. మొత్తం 12 మైదానాల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఆఫ్రికన్ పిచ్‌లు బౌన్స్‌కు, వేగానికి ప్రసిద్ధి. ఇక్కడ భారత్ విజయం సాధించడం సవాలుతో కూడుకున్న పని. అయితే, ఆఫ్రికా గడ్డపై విరాట్ కోహ్లీకి ఉన్న అనుభవం టీమిండియాకు పెద్ద ప్లస్ పాయింట్. ఇప్పటివరకు అక్కడ ఆడిన 25 ఇన్నింగ్స్‌లలో కోహ్లీ 71.47 సగటుతో 1358 పరుగులు చేశాడు. ఇందులో 4 శతకాలు, 9 అర్ధశతకాలు ఉన్నాయి.
కోహ్లీ ఆడిన 25 ఇన్నింగ్స్‌లలో ఐదుసార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. కేప్‌టౌన్‌లో నాటౌట్‌గా 160, సెంచూరియన్‌లో 129, డర్బన్‌లో 112, హరారేలో 115 పరుగులతో కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. టోర్నీ జరగనున్న 12 స్టేడియాల్లో 8 మైదానాల్లో కోహ్లీకి ఇప్పటికే ఆడిన అనుభవం ఉంది.
మిగిలిన 4 మైదానాల్లో కోహ్లీ ఇప్పటివరకు కాలు మోపలేదు. బఫెలో పార్క్, బ్లూమ్‌ఫోంటెన్, విక్టోరియా ఫాల్స్, విండ్‌హోక్ మైదానాల్లో కోహ్లీకి ఆడే అవకాశం ఇంకా రాలేదు. బులావాయోలో మాత్రం అతను సున్నా పరుగులకే అవుట్ అయ్యాడు. ఆఫ్రికా వేదికలపై కోహ్లీ ప్రదర్శన ఈ ప్రపంచకప్‌లో భారత్ విజయానికి కీలకం కానుంది.







