భారత స్టార్ షట్లర్ పీవీ సింధు 2026 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో తన మొదటి మ్యాచ్‌ను విజయంతో ప్రారంభించింది. ఆటతో పాటు ఆమె నుదుటిపై ఉన్న చిన్న పరికరం చర్చనీయాంశమైంది. ఇది ఏఐ (కృత్రిమ మేధస్సు) ఆధారిత వేరబుల్ టెక్నాలజీతో పనిచేసే 'టెంపుల్' అనే ప్రయోగాత్మక ఫిట్‌నెస్ మరియు బ్రెయిన్ ట్రాకింగ్ డివైస్.
ఈ పరికరం క్రీడాకారులు ఒత్తిడిలో ఉన్నప్పుడు వారి మెదడు, శరీరం ఎలా స్పందిస్తాయో రియల్ టైమ్‌లో విశ్లేషిస్తుంది. ఇది మెదడుకు జరిగే రక్త ప్రసరణ, ఆక్సిజన్ స్థాయిలను పర్యవేక్షించడంతో పాటు, ఆటలో ఏకాగ్రత మరియు అలసటను నమోదు చేస్తుంది. సుమారు ఒక అంగుళం పొడవుండే ఈ పరికరం ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 నుంచి 4 గంటల పాటు డేటాను రికార్డ్ చేయగలదు.
జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ నేతృత్వంలోని బృందం దీన్ని అభివృద్ధి చేసింది. సింధు ఈ ప్రయోగ పరీక్షల్లో భాగస్వామిగా ఉంటూ తన ఫీడ్‌బ్యాక్‌ను అందిస్తోంది. ప్రస్తుతం ఇది ప్రయోగ దశలోనే ఉందని, ప్రాథమిక ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని సింధు భర్త వెంకట దత్త సాయి తెలిపారు.
ఈ పరికరం ప్రస్తుతం మార్కెట్లో అమ్మకానికి అందుబాటులో లేదు. తగిన పరిశోధనల తర్వాత రాబోయే 6 నుంచి 12 నెలల్లో సాధారణ ప్రజల కోసం దీన్ని విడుదల చేసే అవకాశం ఉంది. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌ను లక్ష్యంగా పెట్టుకున్న సింధు, తన ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకునేందుకు ఈ అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తోంది.








