గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పవన్ కల్యాణ్, చికిత్స కోసం కేరళ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. గత నెలలో భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన, వారం రోజులుగా తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ అనారోగ్య సమస్యల కారణంగానే ఆయన ఇటీవల కేబినెట్ సమావేశాలతో పాటు పలు అధికారిక కార్యక్రమాలకు హాజరు కాలేకపోయారు.

కేరళలోని ప్రకృతి వైద్య చికిత్స కేంద్రంలో ఆయన 20 రోజుల పాటు ఉండి చికిత్స తీసుకోనున్నారు. ఈ చికిత్స ద్వారా ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుందని భావిస్తున్నారు.

మరోవైపు, కేరళ పర్యటనకు వెళ్లే ముందు గురువారం శాసనసభ ప్రాంగణంలోని తన కార్యాలయంలో పవన్ కల్యాణ్ జనసేన శాసనసభా పక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్, పంచాయతీ రాజ్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులతో చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు.

పార్టీ సంస్థాగత కమిటీల ఎంపిక ప్రక్రియపై కూడా పవన్ సమీక్షించారు. పార్లమెంట్ స్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు వచ్చిన 36 వేలకు పైగా దరఖాస్తులను ఆయన పర్యవేక్షణలోని బృందం పరిశీలించింది. అయితే, ఈ జాబితాలో మరిన్ని మార్పులు, సవరణలు చేయాలని ఆయన నిర్ణయించారు.

పార్టీ కోసం కష్టపడిన నాయకులు, జనసైనికులు, వీరమహిళలకు తగిన గుర్తింపు దక్కేలా ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు మరికొద్ది వారాల సమయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.