కన్నూర్‌కు చెందిన ఒక నర్సింగ్ కళాశాల ప్రొఫెసర్ 2016 నవంబర్ 25న స్థానిక మ్యారేజ్ బ్యూరోలో రూ. 3,000 చెల్లించి పేరు నమోదు చేసుకున్నారు. త్వరలోనే మంచి సంబంధం చూపిస్తామని ఆ సంస్థ హామీ ఇచ్చింది. అయితే, తొమ్మిదేళ్లు గడిచినా సంస్థ ఒక్క సంబంధాన్ని కూడా చూపించలేకపోయింది. ప్రతిసారీ ఏదో ఒక సాకు చెబుతూ కాలయాపన చేయడంతో బాధితుడు కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించాడు.

తన పెళ్లి కోసం వృద్ధులైన తల్లిదండ్రులు ఎంతో ఆశతో ఎదురుచూశారని బాధితుడు కోర్టుకు వివరించాడు. తన తండ్రి 2025లో క్యాన్సర్‌తో మరణించారని, తల్లి కూడా అనారోగ్యంతో ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. మ్యారేజ్ బ్యూరో తన బాధ్యతను సకాలంలో నిర్వర్తించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఆయన వాదించాడు. విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపినప్పటికీ, మ్యారేజ్ బ్యూరో ప్రతినిధులు కోర్టుకు రాలేదు, కనీసం వివరణ కూడా ఇవ్వలేదు.

బాధితుడు సమర్పించిన రిజిస్ట్రేషన్ పత్రాలు, ఫీజు చెల్లింపు ఆధారాలను పరిశీలించిన జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్, మ్యారేజ్ బ్యూరో సేవల్లో లోపం ఉందని నిర్ధారించింది. రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 3,000 తిరిగి చెల్లించాలని, మానసిక వేదనకు రూ. 3,000 పరిహారం ఇవ్వాలని, కోర్టు ఖర్చుల కింద మరో రూ. 2,000 చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది.

ఈ మొత్తాన్ని 30 రోజుల్లోగా చెల్లించాలని కమిషన్ స్పష్టం చేసింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా చెల్లింపులు జరగకపోతే, రీఫండ్ మొత్తంపై వార్షికంగా 9 శాతం వడ్డీని కూడా మ్యారేజ్ బ్యూరో భరించాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది.