సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్‌లోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాలతో పాటు చిగురుమామిడి, సైదాపూర్‌, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. గతేడాది జూన్‌లో 94.2 మి.మీ, జూలైలో 339.2 మి.మీ వర్షం కురవగా, ఈ ఏడాది జూన్‌లో కేవలం 57.0 మి.మీ, జూలైలో 69.0 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా, పంటలకు సరిపడా వర్షం పడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

గతేడాది జూలై నెలాఖరు నాటికి 1,00,353 ఎకరాల్లో సాగు జరిగినప్పటికీ, ఈసారి వర్షాలు లేక 20 శాతం పంటలు కూడా సాగు కాలేదు. కొన్ని గ్రామాల్లో రైతులు కనీసం దుక్కులు కూడా దున్నలేదు. తొలకరి జల్లుల ఆశతో వరినార్లు పోసిన రైతులు, అవి ముదిరిపోతుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పత్తి మొక్కలను కాపాడుకునేందుకు రైతులు బిందెలతో నీళ్లు పోస్తున్న పరిస్థితి నెలకొంది. వర్షాల కోసం ప్రజలు గ్రామ దేవతలకు పూజలు, జలాభిషేకాలు చేస్తున్నారు.

గత పదేళ్లుగా మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు, గౌరవెల్లి రిజర్వాయర్ వంటి నీటి వనరుల అభివృద్ధి వల్ల ఈ ప్రాంతంలో కరువు ఛాయలు లేవు. అయితే, ప్రస్తుతం గౌరవెల్లి ప్రాజెక్టులో నీటి నిల్వ లేకపోవడం, వర్షాలు కురవకపోవడంతో బోరుబావుల్లో నీటి మట్టం పడిపోయింది. మరో 15 రోజుల్లో వర్షాలు పడకుంటే ఈ ఏడాది పంటలు పండటం కష్టమని, కరువు పరిస్థితులు మళ్లీ దాపురిస్తాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.