సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామానికి చెందిన రేవర్తి కిషన్, తన భార్యతో కొంతకాలంగా గొడవ పడుతున్నాడు. భార్య తనపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడంతో కిషన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇంట్లో భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరుగుతుండగా, వారి ఎనిమిదేళ్ల కుమారుడు రుత్విక్ అక్కడే ఉండి నవ్వాడు.

తనను చూసి కొడుకు నవ్వుతున్నాడనే కారణంతో కిషన్ విచక్షణ కోల్పోయాడు. వెంటనే పొయ్యి మీద కాగుతున్న వేడి నీళ్లను తీసుకుని బాలుడిపై పోశాడు. తీవ్ర గాయాలపాలైన రుత్విక్ విలవిలలాడటంతో స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే అతడిని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆసుపత్రిలో బాలుడికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు కిషన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.