తెలంగాణలో వరంగల్ (మామునూరు), ఆదిలాబాద్ విమానాశ్రయాల నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడుతో సమావేశమై ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. 2028 జూన్ 2 నాటికి ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఇరువురు నేతలు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
వరంగల్ విమానాశ్రయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సమయంలో 253 ఎకరాల భూమిని అప్పగించడంపై మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. కాకతీయ కళా వైభవాన్ని చాటేలా, అంతర్జాతీయ ప్రమాణాలతో టెర్మినల్ భవనాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం బౌండరీ వాల్, రన్‌వే పనులకు టెండర్లు సిద్ధమవగా, మరో 3-4 వారాల్లో టెర్మినల్ నిర్మాణానికి టెండర్లు పిలవనున్నారు. ప్రాజెక్టులో ఎలాంటి జాప్యం ఉండదని, తన హయంలోనే పనులు పూర్తవుతాయని మంత్రి స్పష్టం చేశారు.
మరోవైపు ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని డిఫెన్స్-సివిలియన్ ఎయిర్‌పోర్ట్‌గా మార్చేందుకు ఉభయ ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. దీనికి కావలసిన సుమారు 1,500 ఎకరాల భూసేకరణ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రక్షణ శాఖ నుంచి అనుమతులు వచ్చిన వెంటనే ఆదిలాబాద్ పనులు వేగం అందుకుంటాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు, కాని రాష్ట్రాలకు తేడా లేకుండా దేశ అభివృద్ధి లక్ష్యంతో కేంద్రం వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.
భారత్‌ను ఏవియేషన్ హబ్‌గా మార్చే ప్రధాని మోదీ లక్ష్యంలో భాగంగా, తెలంగాణకు కేంద్రం పూర్తి సహకారం అందించనుంది. రూరల్ కనెక్టివిటీ కోసం ఉడాన్ పథకాన్ని మరో 10 ఏళ్లు పొడిగించిన నేపథ్యంలో, రాష్ట్రాన్ని గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేర్చడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు.






