కృష్ణా జిల్లా అవనిగడ్డ జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఇటీవల విజయవాడలో జరిగిన మాజీ సీఎం రోశయ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసి తప్పు చేశానని, ప్రస్తుతం రాజకీయాలు కలుషితమయ్యాయని ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించారు. సీనియర్ నాయకుడైన బుద్ధప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు సొంత పార్టీలోనూ ఆందోళన కలిగిస్తున్నాయి.

గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో పనిచేసిన బుద్ధప్రసాద్, 2024 ఎన్నికల సమయంలో జనసేనలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, నియోజకవర్గంలో కూటమిలోని తెలుగుదేశం పార్టీ నేతల నుంచి తనకు సహకారం అందడం లేదని ఆయన భావిస్తున్నారు. ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన రోడ్డుకు టీడీపీ నేతలు మళ్లీ శంకుస్థాపన చేయడం, అన్న క్యాంటీన్ శిలాఫలకంపై పేర్లు లేవని రచ్చ చేయడం వంటి ఘటనలతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

స్థానిక టీడీపీ నేతల తీరుపై ఇన్చార్జి మంత్రి సుభాష్‌కు బుద్ధప్రసాద్ పలుమార్లు ఫిర్యాదు చేశారు. కొందరు నేతలపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని కూడా గతంలో హెచ్చరించారు. మరోవైపు, టీడీపీ నేతలు కూడా బుద్ధప్రసాద్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ మారిన తర్వాత తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, ఆయన గెలుపులో తమ పాత్రను విస్మరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

ఎన్నికల ముందే ఇది తన చివరి ఎన్నికలని ప్రకటించిన బుద్ధప్రసాద్, గెలిచిన తర్వాత కూడా రాజకీయాలపై విరక్తిగా మాట్లాడటం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో, ఆయన భవిష్యత్తులో రాజకీయాలకు దూరంగా ఉండే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.