ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే, గతంలో బ్యాంకుల నుంచి తీసుకున్న సుమారు రూ.400 కోట్ల రుణాలను వారం రోజుల వ్యవధిలో తిరిగి చెల్లించారు. 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న సదరు నేత, తన కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని వ్యాపార సంస్థలను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థలు గత ఆరేళ్లలో వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో, బ్యాంకులు వీటిని మొండి బకాయిలుగా ప్రకటించాయి.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఏడాదిన్నర కాలంలోనే ఆయన ఆర్థిక పరిస్థితిలో మార్పు రావడం గమనార్హం. కేవలం వన్ టైమ్ సెటిల్మెంట్ (OTS) కింద ఒక బ్యాంకుకు రూ.120 కోట్లు చెల్లించి, ఎన్వోసీ (NOC) కూడా పొందారు. గతంలో అప్పుల ఊబిలో కూరుకుపోయి డీఫాల్టర్లుగా ఉన్న సదరు నేత, ఇంత తక్కువ సమయంలో భారీ మొత్తాన్ని ఎలా సమకూర్చుకున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

2023 ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన తన ఆస్తుల విలువను వంద కోట్ల రూపాయల లోపే చూపించారు. అంతేకాకుండా, ఆయనకు విదేశీ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయని, వాటిని అఫిడవిట్‌లో పేర్కొనలేదని ఆరోపణలు ఉన్నాయి. గతంలో అప్పుల పాలైన నేత, ఇప్పుడు వందల కోట్ల రూపాయల రుణాలను ఒకేసారి ఎలా తీర్చగలిగారనే దానిపై రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ భారీ మొత్తాన్ని సదరు ఎమ్మెల్యే ఏ ఆదాయ వనరుల ద్వారా సేకరించారనేది స్పష్టత లేదు. దీనిపై ఆయన స్వయంగా స్పందిస్తే తప్ప అసలు వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.