సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం మిర్జాపూర్(బీ) కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)లో రోగి పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మంత్రి దామోదర రాజనర్సింహ ఆరాతీశారు. గంగ్వార్ గ్రామానికి చెందిన ముత్తమ్మ అనే మహిళకు రక్త పరీక్ష రిపోర్టుకు బదులుగా, మరొకరి రిపోర్టును చూసి వైద్యులు మందులు రాసిచ్చినట్లు గుర్తించారు. ఈ ఘటనపై జూలై 16న ప్రచురితమైన వార్తా కథనంపై మంత్రి స్పందించారు.

ఈ వ్యవహారంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపోర్టులను క్షుణ్ణంగా పరిశీలించకుండా వైద్యం చేయడం సరికాదని ఆయన మందలించారు. రక్త పరీక్ష రిపోర్టులు సంగారెడ్డి ల్యాబ్ నుంచి వచ్చాయని సీహెచ్‌సీ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రెడ్డి మంత్రికి వివరించినట్లు సమాచారం. విధి నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని మంత్రి హెచ్చరించారు.

ఈ ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి ఆదేశాలు అందాయి. దీనిపై సీహెచ్‌సీ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం వైద్యాధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ముత్తమ్మకు అందిన వైద్యసేవలపై ఆరా తీసిన ఆయన, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు వహించాలని సిబ్బందిని ఆదేశించారు.