వెంకటరమణ(శ్రీకాంత్) ఒక మధ్యతరగతి వ్యక్తి. వేంకటేశ్వరస్వామికి వీర భక్తుడైన అతను, కుటుంబ పోషణలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధతో సతమతమవుతుంటాడు. చివరకు పరిస్థితి చేయి దాటిపోవడంతో, దేవుడిని వేడుకుంటూ గుడి మెట్లపై నిద్రపోతాడు. ఆ సమయంలో వేంకటేశ్వరస్వామి(రాజేంద్రప్రసాద్) ప్రత్యక్షమై అతనికి ఒక మాయా పుస్తకాన్ని ఇస్తాడు. ఆ పుస్తకంలో రాసినది నిజమవుతుందనే కండిషన్‌తో కథ మలుపు తిరుగుతుంది.

ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్ మొదటిసారి వేంకటేశ్వరస్వామి పాత్రలో నటించగా, లయ పద్మావతిగా కనిపించింది. అలీ, సునీల్, వెన్నెల కిషోర్, రఘుబాబు, బాబూమోహన్, ధనరాజ్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. బ్లూ.J క్రియేషన్స్ బ్యానర్‌పై GK, చందు నిర్మించిన ఈ సినిమాకు జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించారు. ఫస్ట్ హాఫ్‌లో మధ్యతరగతి కష్టాలను ఎమోషనల్‌గా చూపిస్తూనే, సెకండ్ హాఫ్‌లో మనిషి అత్యాశ, గర్వం వంటి లక్షణాలను కామెడీతో జోడించారు.

సినిమాలో వేంకటేశ్వరస్వామిపై వచ్చిన రెండు పాటలు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్‌లో వెన్నెల కిషోర్ చేసిన అఖండ స్పూఫ్ నవ్విస్తుంది. అయితే, సెకండ్ హాఫ్‌లోని కొన్ని సన్నివేశాలు పాత సినిమాలను గుర్తుకు తెస్తాయి. ఎడిటింగ్ పరంగా ఫస్ట్ హాఫ్‌లో మరికొన్ని కట్స్ అవసరమనిపిస్తుంది. గ్రాఫిక్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది.

మొత్తంగా చూస్తే, దేవుడు వరం ఇస్తే భక్తులు ఎలా స్పందిస్తారనే పాత కాన్సెప్ట్‌ను కామెడీ, ఎమోషన్స్‌తో దర్శకుడు తెరకెక్కించారు. ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వవచ్చు. క్లైమాక్స్‌లో పార్ట్ 2కు సంబంధించిన లీడ్ కూడా ఇచ్చారు.