ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లోని లోహియా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంసీసీ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న 25 ఏళ్ల నేహా శనివారం అనుమానాస్పద స్థితిలో మరణించింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆపరేషన్ థియేటర్‌లో ఆమె అపస్మారక స్థితిలో కనిపించగా, వైద్యులు పరీక్షించి మరణించినట్లు నిర్ధారించారు. మృతదేహం వద్ద సల్ఫర్ మాత్రలు, అత్తమామలపై ఆరోపణలు చేసే సూసైడ్ నోట్ లభించడంతో మొదట ఇది ఆత్మహత్యగా భావించారు.

అయితే, సూసైడ్ నోట్‌పై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ కాల్ రికార్డులను పరిశీలించగా, ఆస్పత్రి ఉద్యోగి సురేష్‌తో నేహాకు గత 7-8 ఏళ్లుగా ప్రేమాయణం ఉన్నట్లు తేలింది. నేహా, సురేష్ మరియు మరో ఉద్యోగి ఫర్హాన్‌తో కలిసి ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

విచారణలో సురేష్ నేరాన్ని అంగీకరించాడు. తనకు ఇప్పటికే వివాహమై ఐదేళ్ల కొడుకు ఉన్నా, నేహా తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తోందని అందుకే ఆమెను చంపినట్లు చెప్పాడు. నేహా నీరసంగా ఉందని చెప్పినప్పుడు, శక్తినిచ్చే సెలైన్ ఎక్కిస్తామని నమ్మించి అందులో విషం కలిపినట్లు పోలీసులు గుర్తించారు. ఫఫుండాకు చెందిన నేహా, తన భర్త రవి కుమార్ ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్న తర్వాత, కుటుంబ పోషణ కోసం నర్సుగా పనిచేస్తోంది.

ఈ కేసులో నిందితుడు సురేష్‌తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు రాసిన నకిలీ సూసైడ్ నోట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.