సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రాజీవ్ రాయ్ ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారని ఉత్తరప్రదేశ్ మంత్రి ఓం ప్రకాష్ రాజ్‌భర్ తెలిపారు. బల్లియా జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ భేటీ పార్టీలోని అంతర్గత తిరుగుబాటుకు నాంది పలికిందని, ఈ ఉద్యమానికి రాజీవ్ రాయ్ నాయకత్వం వహించే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశంలో పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర తర్వాత ఉత్తరప్రదేశ్‌లోనూ ఫిరాయింపు రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయని ఆయన గుర్తుచేశారు.

సమాజ్‌వాదీ పార్టీ భవిష్యత్తును కాపాడాలంటే అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని మంత్రి రాజ్‌భర్ అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత ఆ బాధ్యతలు శివపాల్ సింగ్ యాదవ్ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఉద్ధవ్ థాక్రే, మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీల్లాగే సమాజ్‌వాదీ పార్టీ కూడా చీలికను ఎదుర్కొంటోందని రాజ్‌భర్ ఆరోపించారు.

అఖిలేష్ యాదవ్ తన బాబాయి శివపాల్ సింగ్ యాదవ్‌ను పార్టీ వ్యవహారాల నుంచి దూరం పెట్టారని, గతంలో అసెంబ్లీలో శివపాల్ వర్గీయులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మంత్రి విమర్శించారు. ఈ నేపథ్యంలోనే పార్టీని కాపాడుకోవడానికి అఖిలేష్ తప్పుకోవాల్సి వస్తుందని, శివపాల్ నాయకత్వం బాధ్యతలు స్వీకరిస్తారని రాజ్‌భర్ జోస్యం చెప్పారు.

ఈ వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ పార్టీ నేతలు స్పందిస్తూ, రాజకీయ ప్రాధాన్యం కోసమే మంత్రి ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని మండిపడ్డారు. అఖిలేష్ యాదవ్ గతంలో రాజ్‌భర్‌ను 'పుకార్లు ప్రచారం చేసే మంత్రి'గా విమర్శించిన విషయాన్ని ఇక్కడ గుర్తుచేసుకోవచ్చు. మరోవైపు తన పార్టీ ఎస్బీఎస్పీలో విభేదాలు ఉన్నాయన్న ప్రచారాన్ని రాజ్‌భర్ ఖండించారు.

తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలలో ఐదుగురు తనతోనే ఉన్నారని, కేవలం ఒకరు మాత్రమే సమాజ్‌వాదీ పార్టీ జెండాలతో కనిపిస్తున్నారని మంత్రి వివరించారు. అయితే ఆయన కుమారుడు అరుణ్ రాజ్‌భర్ ముగ్గురు ఎమ్మెల్యేలు సమాజ్‌వాదీ పార్టీ వైపు మొగ్గు చూపారని చేసిన వ్యాఖ్యలతో పార్టీలో అంతర్గత భేదాభిప్రాయాలపై ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.