నీట్-యూజీ 2026 పునఃపరీక్షకు ముందు మహారాష్ట్రలోని నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబిలో పరీక్షా కేంద్రం కేటాయించిన అంశం రాజకీయ దుమారం రేపింది. పాస్‌పోర్ట్ లేని అభ్యర్థికి విదేశీ కేంద్రం ఎలా ఇస్తారని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. పరీక్షా వ్యవస్థ వైఫల్యానికి ఇది నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు.
ఈ విమర్శలపై జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) స్పందిస్తూ, ఆ విద్యార్థి స్వయంగా తన లాగిన్ ద్వారానే పరీక్షా నగరాన్ని అబుదాబిగా మార్చుకున్నట్లు వెల్లడించింది. వెబ్ యాక్టివిటీ రికార్డుల ప్రకారం ఒకే యూజర్ ఖాతా ద్వారా ఈ మార్పు జరిగిందని, తర్వాత అదే ఖాతా నుంచి కేంద్ర వివరాలు రెండుసార్లు పరిశీలించబడ్డాయని సంస్థ తెలిపింది. జూన్ 21న జరగనున్న పరీక్షకు ముందు నగరాల మార్పుకు అవకాశం కల్పించగా, దేశవ్యాప్తంగా 3.2 లక్షల మంది ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని ఎన్‌టీఏ పేర్కొంది.
విద్యార్థి తండ్రి నుంచి జూన్ 19 సాయంత్రం అనధికారిక అభ్యర్థన అందడంతో, వెంటనే స్పందించిన అధికారులు నాగ్‌పూర్‌లోనే పరీక్షా కేంద్రం కేటాయించి కొత్త అడ్మిట్ కార్డు జారీ చేశారు. తమ విధానం 'స్టూడెంట్ ఫస్ట్' సూత్రంపై ఆధారపడి ఉంటుందని, పరిపాలనా సమస్యల వల్ల ఏ అభ్యర్థి కూడా పరీక్షకు దూరం కాకూడదనేదే తమ లక్ష్యమని ఎన్‌టీఏ స్పష్టం చేసింది.
విద్యార్థి తండ్రి మాట్లాడుతూ, నాగ్‌పూర్ మెడికల్ కాలేజీని కేంద్రంగా చూపిస్తూ కొత్త అడ్మిట్ కార్డు అందిందని, వేగంగా స్పందించిన ఎన్‌టీఏ అధికారులకు మరియు మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. తమ కుమారుడు అబ్దుల్లా మళ్లీ పరీక్ష రాయడానికి సిద్ధంగా లేకపోయినా, అతడిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పరిణామంతో వివాదం తాత్కాలికంగా ముగిసినట్లు కనిపిస్తున్నా, రేపటి పరీక్షపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.








