మంచిర్యాల జిల్లా చెన్నూరులో మంత్రి వివేక్ వెంకటస్వామి రైతులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. వాతావరణ మార్పులు, ఎల్ నినో ప్రభావంతో తలెత్తే పరిస్థితులపై ఆయన రైతులతో సుదీర్ఘంగా చర్చించారు. వర్షాభావం ఏర్పడితే పంట నష్టం జరగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని రైతులకు సూచించారు.
ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతలు హరీష్ రావు, కేటీఆర్‌లపై మంత్రి వివేక్ మండిపడ్డారు. కాళేశ్వరం పంపులు నడపాలని వారు డ్రామాలు ఆడుతున్నారని, రైతుల సమస్యలను పక్కన పెట్టి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వంపై బురదజల్లేందుకు విపక్షాలు చేస్తున్న కుట్రలను రైతులు గమనించాలని, వారి తప్పుడు మాటలను నమ్మవద్దని మంత్రి పిలుపునిచ్చారు.
ప్రత్యామ్నాయ, ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని రైతులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ అధికారులు ఇచ్చే సలహాలను పాటించాలని, తక్కువ నీటితో పండే పంటల వైపు మొగ్గు చూపాలని కోరారు. ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగు లాభదాయకమని, దీనివల్ల నష్టం ఉండదని ఆయన స్పష్టం చేశారు.
రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. రైతులు అధైర్యపడకుండా వ్యవసాయ శాఖ సూచనలను అనుసరించాలని మంత్రి కోరారు.







