హైడ్రాలో కేవలం 150 డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడంతో, దరఖాస్తు చేసుకునేందుకు వేలాది మంది నిరుద్యోగులు సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో నిరుద్యోగుల పట్ల అధికారులు దురుసుగా, అసభ్యంగా ప్రవర్తించారని హరీశ్‌ రావు ఆరోపించారు. ఉద్యోగం కోసం వచ్చిన యువతను గౌరవించాల్సింది పోయి, అధికారులు వారిని అవమానించడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు.

ఎన్నికల సమయంలో రెండు లక్షల ఉద్యోగాలను మొదటి ఏడాదిలోనే భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని హరీశ్‌ రావు ప్రభుత్వాన్ని నిలదీశారు. 32 నెలలు గడిచినా హామీలు అమలు చేయకపోవడం వల్లే, ఉన్నత చదువులు చదివిన యువత కూడా చిన్న చిన్న పోస్టుల కోసం క్యూ కట్టాల్సి వస్తోందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అని సంబోధించడంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

నిరుద్యోగులు తమను ప్రశ్నించడం నేరం కాదని, వారికి ఉద్యోగాలు ఇవ్వలేని ప్రభుత్వం కనీసం గౌరవించడం నేర్చుకోవాలని హరీశ్‌ రావు హితవు పలికారు. నిరుద్యోగులపై అనుచితంగా ప్రవర్తించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, జరిగిన అవమానానికి ప్రభుత్వం విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.