గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర రెడ్డి నిర్మించిన ‘ఓ..! సుకుమారి’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దామిని అనే యువతిని ఎవరైనా తాకితే షాక్ కొడుతుందనే వినూత్న పాయింట్‌తో ఈ కథ సాగుతుంది. సర్పంచ్ కావాలని కలలు కనే యాదగిరి, దామినిని పెళ్లి చేసుకున్న తర్వాత ఎదుర్కొన్న ఇబ్బందులే ఈ చిత్ర ప్రధానాంశం.
సినిమా మొదటి భాగం దామిని పాత్ర పరిచయం, ఆమె వల్ల ఊరి జనాలు పడే ఇబ్బందులతో సరదాగా సాగుతుంది. ముఖ్యంగా పెళ్లి చూపులు, శోభనం సీన్ వరకు వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి. అయితే, సెకండ్ హాఫ్ లో భార్యాభర్తల ప్రేమ, కుటుంబ ఎమోషన్స్ మరియు సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కథ కొంత నెమ్మదించి సాగదీసినట్లు అనిపిస్తుంది.
ఐశ్వర్య రాజేష్ తన పాత్రలో చక్కని నటనను కనబరిచి సినిమాను తన భుజాలపై మోశారు. తిరువీర్ తన పాత్రకు న్యాయం చేయగా, ఆనంద్, ఝాన్సీ, మురళీధర్ గౌడ్, శ్రీనివాస్ గవిరెడ్డి, ఆమని, జీవన్ కుమార్ తదితరులు తమ పరిధి మేరకు నటించారు. తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదనపు ఆకర్షణగా నిలిచాయి.
దర్శకుడు భరత్ దర్శన్ రొటీన్ కథను ఎంచుకున్నా, కథనంలో ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు. క్లైమాక్స్‌లో దామిని సమస్యకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్, ఆ సమస్య వల్ల జరిగిన మంచిని చూపించడం ఆకట్టుకుంటుంది. చివరలో పార్ట్ 2 ఉంటుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.








