వానకాలం మొదలై నెల 15 రోజులు దాటినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ఈ నేపథ్యంలో మండల కేంద్రంలోని బ్రాహ్మణగల్లిలో ఉన్న శ్రీ ముక్తేశ్వర శివాలయంలో మూడు రోజుల పాటు ప్రత్యేక అభిషేకాలు, జలాభిషేకం నిర్వహించారు.
చివరి రోజున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రధాన అర్చకుడు దత్తాత్రేయ కులకర్ణి, రాజేశ్వర్ జోషి మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. చెరువుల్లో నీరు లేక వెలవెలబోతున్నాయని, బోర్లలో నీటి మట్టం తగ్గి పంటలు ఎండిపోతున్నాయని వారు పేర్కొన్నారు. ప్రాణికోటికి నీరే ఆధారమని, పంటలు బాగా పండాలని దేవుడిని వేడుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అనిల్ కులకర్ణి, రాజేశ్వరి జ్యోషి, సిద్దూ, నూకల రమేష్, బీర్కూర్ శ్యామ్ కుమార్, వడ్ల గంగారం తదితరులు పాల్గొన్నారు.








