పాల్నాడు జిల్లా వినుకొండ మండలం ఉమ్మాడివరం గ్రామానికి చెందిన మక్కెన ప్రసన్న (27) అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. రైతు కుటుంబానికి చెందిన ప్రసన్న, 2022లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం అమెరికాకు వెళ్లింది. మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఆమె, ప్రస్తుతం ఉద్యోగ వేటలో ఉంది.

జూలై 14 మంగళవారం న్యూజెర్సీలో ఈ ప్రమాదం జరిగింది. స్నేహితులతో కలిసి కారులో బయటకు వెళ్లి తిరిగి వస్తుండగా, వాహనం అదుపు తప్పి హైవే పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రసన్న అక్కడికక్కడే మరణించగా, ఆమెతో ఉన్న స్నేహితులు గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కుమార్తె మరణవార్తతో తల్లిదండ్రులు మక్కెన వెంకటేశ్వర్లు, గోవిందమ్మ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనపై వినుకొండ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జివి అన్జనేయులు స్పందించారు. ఆయన ప్రసన్న తల్లిదండ్రులను పరామర్శించి, ఆమె మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.