ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్ లలిత్ మోదీ స్వదేశానికి తిరిగి రానున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను విడుదల చేశారు. 2009 నాటి ఐపీఎల్ విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) కేసులో అప్పిలేట్ ట్రైబ్యూనల్ తనకు ఊరటనిస్తూ తీర్పు ఇచ్చిందని ఆయన తెలిపారు.
2010లో ఫెమా నిబంధనల ఉల్లంఘన ఆరోపణలతో లలిత్ మోదీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కేసులు నమోదు చేసింది. ఆ సమయంలో ఐపీఎల్ టోర్నీని దక్షిణాఫ్రికాకు తరలించినప్పుడు నిధుల బదిలీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, ఆయనకు రూ. 10.65 కోట్ల జరిమానాను ఈడీ విధించింది. అప్పటి నుంచి ఆయన విదేశాల్లోనే నివాసం ఉంటున్నారు.
గత 16 ఏళ్లుగా సాగిన న్యాయపోరాటం ట్రైబ్యూనల్ తీర్పుతో ముగిసిందని లలిత్ మోదీ పేర్కొన్నారు. తాను మీడియాకు, అందరికీ చెబుతూ వచ్చిన విషయాలే చివరికి నిజమని తేలాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఐపీఎల్ విజయవంతం కావాలనే లక్ష్యంతోనే తాను పనిచేశానని ఆయన గుర్తు చేసుకున్నారు.
ఈ ఏడాది చివరలో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో భారత్‌కు రావాలని ఆయన నిర్ణయించుకున్నారు. అక్టోబర్‌లో తన కుమార్తె బిడ్డకు జన్మనివ్వనుందని, అంతా సవ్యంగా జరుగుతుందని ఆశిస్తున్నానని లలిత్ మోదీ తెలిపారు. ప్రస్తుతం ఆ పాత అధ్యాయం ముగిసిందని, ఇక తన జీవితంలో ముందుకు సాగుతానని ఆయన పేర్కొన్నారు.







