పొట్ట భాగంలో కొవ్వు పెరగడం అనేది కేవలం అందానికి సంబంధించిన సమస్య కాదు. ఇది ఫ్యాటీ లివర్ వ్యాధికి ప్రధాన హెచ్చరికగా పనిచేస్తుంది. ఈ వ్యాధి ప్రారంభ దశలో లక్షణాలు కనిపించకపోవడం వల్ల దీన్ని 'సైలెంట్ డిసీజ్' అని కూడా పిలుస్తారు. చికిత్స తీసుకోకపోతే కాలేయంలో కొవ్వు పేరుకుపోయి, వాపు, గాయాలు, చివరికి లివర్ ఫెయిల్యూర్ లేదా క్యాన్సర్‌కు దారితీయవచ్చు.
బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) సాధారణంగా ఉన్నవారికి కూడా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది. బీఎంఐ శరీరంలోని కొవ్వు ఎక్కడ నిల్వ అవుతుందో తెలియజేయదు. ప్రత్యేకించి పొట్ట చుట్టూ కొవ్వు పెరిగితే కాలేయ సమస్యలు ఎక్కువ. భారతీయుల్లో తక్కువ బీఎంఐ ఉన్నప్పటికీ పొట్ట కొవ్వు ఎక్కువగా ఉండటం ఈ ప్రమాదాన్ని పెంచుతుంది.
టైప్-2 డయాబెటిస్, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు ఫ్యాటీ లివర్ ప్రమాదం ఎక్కువ. ఈ పరిస్థితులు కలిసి 'మెటబాలిక్ డిస్‌ఫంక్షన్ అసోసియేటెడ్ స్టియాటోటిక్ లివర్ డిసీజ్' (MASLD)గా మారతాయి. పొట్ట చుట్టు పెరుగుతున్నట్లు గమనిస్తే, మరోవైపు డయాబెటిస్ లేదా కొలెస్ట్రాల్ సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించాలి.
రోజూ వేగంగా నడక, జాగింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయడం ద్వారా కాలేయంలోని కొవ్వు తగ్గుతుంది. ప్రోటీన్, పండ్లు, కూరగాయలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది. చక్కెర పానీయాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించడం ద్వారా కూడా ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవచ్చు.






