తెలంగాణలో 37 రాష్ట్రస్థాయి కార్పొరేషన్లు, ఫెడరేషన్ల చైర్మన్ల పదవీకాలం ముగియడంతో కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల వివాదం రేగింది. 2024 జూలై 7న నియమితులైన చైర్మన్ల కాలపరిమితి జూలై 8, 2026తో ముగిసింది. దీంతో తమ పదవులను పొడిగించాలని తూర్పు జగ్గారెడ్డి భార్య నిర్మల, పటేల్ రమేశ్ రెడ్డి, గురునాథ్ రెడ్డి, ఎం వీరయ్య తదితరులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరు ఢిల్లీ స్థాయిలో పైరవీలు సాగిస్తుండగా, కొందరు నేతలు గాంధీభవన్ చుట్టూ లాబీయింగ్ మొదలుపెట్టారు.
అయితే, పాత చైర్మన్ల పనితీరుపై నివేదికలు తెప్పించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పదవీకాలం పొడిగింపు విషయంలో కఠినంగా వ్యవహరించే సంకేతాలు ఇచ్చారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, రెన్యూవల్ కు అర్హుల సంఖ్యను సింగిల్ డిజిట్ కే పరిమితం చేయాలని సీఎం భావిస్తున్నారు. ప్రస్తుతం ఖాళీ అయిన పదవులు, ఇప్పటివరకు భర్తీ కానివి కలిపి 50కి పైగా ఉన్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, తనకు అండగా ఉండే వలస కాంగ్రెస్ నేతలతోనే ఈ కీలక పదవులను భర్తీ చేయాలని ముఖ్యనేత ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
ఈ నేపథ్యంలో తన భార్య నిర్మల ఎన్నికల్లో పోటీ చేస్తారని తూర్పు జగ్గారెడ్డి చేసిన ప్రకటనల వెనుక, పార్టీ అగ్రనాయకత్వంపై ఒత్తిడి తెచ్చే ఉద్దేశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు, కుల సంక్షేమ కార్పొరేషన్ల విషయంలో మాత్రం ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మే 6న బ్రాహ్మణ, కమ్మ, వెలమ, యాదవ, మున్నూరుకాపు, వాల్మీకి బోయ, పద్మశాలి సంస్థలతో సహా 18 కార్పొరేషన్లకు చైర్మన్లను, 11 మంది వైస్ చైర్మన్లను ఖరారు చేశారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కు బస్వరాజు శ్రీనివాస్, కమ్మ కార్పొరేషన్ కు బండి రమేశ్, వెలమ కార్పొరేషన్ కు జువ్వాడి నర్సింగ్ రావు, యాదవ సహకార సంస్థకు ఎం రఘునాథ్ యాదవ్, మున్నూరుకాపుకు బొమ్మ శ్రీరామ్, వాల్మీకి బోయకు గట్టు తిమ్మప్ప, పద్మశాలికి గూడూరు శ్రీనివాస్ లను నియమించారు.
కొత్త చైర్మన్ల నియామకం జరిగినా, ఈ సంస్థలకు నిధులు విడుదల కాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. సబ్సిడీ రుణాలు, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు తగిన నిధులు లేకపోవడంతో చాలా కార్పొరేషన్లు నామమాత్రంగానే మిగిలిపోయాయని తెలుస్తున్నది. ఇప్పటికే కొందరు కొత్త చైర్మన్లు కార్యాలయాలు, భద్రతా సిబ్బంది వంటి సౌకర్యాల కోసం లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. మిగిలిన పదవులను జూలైలోనే భర్తీ చేస్తామని టీపీసీసీ చీఫ్ గతంలో ప్రకటించారు.







