ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న టీమిండియా ఈ నెల 14, 16, 19 తేదీల్లో మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమైంది. టీ20 సిరీస్ ముగించుకున్న భారత జట్టు ఇప్పుడు శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్‌తో తలపడనుంది. ఈ సిరీస్ కోసం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకుని ముమ్మరంగా సాధన చేస్తున్నారు.

ఆదివారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా విరాట్ కోహ్లీ, కెప్టెన్ గిల్ సీరియస్‌గా సంభాషిస్తున్న ఫొటోలు విస్తృతంగా వ్యాపించాయి. దీనిపై మీడియా ప్రశ్నించగా, గిల్ ఆ చర్చ వివరాలను బయటపెట్టారు. దక్షిణాఫ్రికాలో జరగబోయే 2027 వన్డే ప్రపంచ కప్ కోసం జట్టు కూర్పు, ప్రణాళికలపై కోహ్లీతో తాను వివరంగా మాట్లాడినట్లు గిల్ స్పష్టం చేశారు.

"దక్షిణాఫ్రికాలో మనకు ఏ కాంబినేషన్ బెస్ట్ అవుతుంది, ప్రస్తుతం జట్టులో లేకపోయినా భవిష్యత్తులో ఉపయోగపడే ఆటగాళ్లు ఎవరు" అనే అంశాలపై విరాట్ కోహ్లీ భాయ్‌తో చర్చించామని గిల్ తెలిపారు. జట్టులో ఎవరు ఉండాలో కోహ్లీకి స్పష్టమైన ఆలోచన ఉందని ఈ వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది. గిల్ 2027 వరల్డ్ కప్ గెలవాలనే కసితో కోహ్లీ సలహాలు తీసుకుని జట్టును సిద్ధం చేస్తున్నట్లు క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వరల్డ్ కప్ జట్టులో ఉంటారా అనే అనుమానాలకు గిల్ మాటలు తెరదించినట్లైంది. కోహ్లీ కచ్చితంగా వరల్డ్ కప్ ఆడటమే కాకుండా, గెలిచే జట్టును రూపొందించే పనిలో ఉన్నారని ఇది స్పష్టం చేస్తోంది. అయితే కోహ్లీ ఏ ఆటగాళ్లను జట్టులోకి తీసుకోమన్నాడో, సౌతాఫ్రికా పరిస్థితులకు ఎవరు పనికిరారని చెప్పారో అనే విషయంపై మాత్రం ఆసక్తి నెలకొంది.