జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ మహాత్మా గాంధీ మెమోరియల్ (MGM) మెడికల్ కాలేజీలో విధులు నిర్వహిస్తున్న 135 మంది హోంగార్డులు గత ఐదు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నారు. కుటుంబ పోషణ, పిల్లల చదువు, వైద్య ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో జూలై 8న అలాదిన్ మహాలి అనే మహిళా హోంగార్డు ఆసుపత్రి ప్రాంగణంలో ఫినైల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సహచరులు ఆమెను కాపాడి ఆసుపత్రికి తరలించారు. తన తల్లి అనారోగ్యం, కుమారుడి స్కూల్ ఫీజు చెల్లించలేక, జీతం రాక తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపింది.
ఈ ఘటన జరిగిన పది రోజులకే జూలై 18న ఫుల్‌కుమారి హెంబ్రామ్ అనే మరో మహిళా హోంగార్డు ఆసుపత్రి వద్ద కన్నీరుమున్నీరైంది. తీవ్రమైన కడుపునొప్పి సమస్యతో బాధపడుతున్న తాను, మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవని, జీతం ఇప్పించకపోతే చనిపోతానని ఆమె వేడుకుంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించాయి.
మొదటి ఘటన తర్వాత MGM మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ కుమార్ బాధిత హోంగార్డును పరామర్శించి తక్షణ ఆర్థిక సహాయం అందించారు. వేతనాల చెల్లింపు కోసం సంబంధిత శాఖకు లేఖ రాశామని, ప్రధాన కార్యాలయం నుంచి నిధులు విడుదల కాగానే 135 మంది హోంగార్డులకు పెండింగ్ జీతాలను ప్రాధాన్య క్రమంలో చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు.








