బెంగళూరులోని బాగలగుంటె, హవనూర్ లేఅవుట్ ప్రాంతంలో ఉన్న ఒక డ్యూప్లెక్స్ ఇంట్లో 52 ఏళ్ల దక్షాయణి అస్థిపంజరం బయటపడింది. ఆమె ఏడాది క్రితమే మరణించి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. చనిపోయిన తర్వాత ఆమె మృతదేహాన్ని ఎవరూ గుర్తించకపోవడం గమనార్హం.

దక్షాయణి భర్త పదేళ్ల క్రితం మరణించగా, ఆమె కొడుకు క్యాన్సర్‌తో చనిపోయాడు. కుటుంబ సభ్యులను కోల్పోయిన ఆమె తీవ్ర మానసిక క్షోభతో ఒంటరిగా జీవిస్తోంది. ఆమెకు కూతురు, అల్లుడు ఉన్నప్పటికీ, వారు ఎప్పుడూ ఇంటికి రాకపోవడంతో ఆమె ఒంటరితనంలోనే కాలం వెళ్లదీసింది.

కొన్ని నెలలుగా ఇంటికి తాళం వేసి ఉండటం, దక్షాయణి బయట కనిపించకపోవడంతో స్థానికులకు అనుమానం కలిగింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా, అస్థిపంజరం కనిపించింది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి కూతురు, అల్లుడికి సమాచారం అందించినట్లు అధికారులు తెలిపారు.