షాబాద్ ఘోర హత్యాకాండలో తన కుటుంబ సభ్యులను కోల్పోయి ఒంటరిగా మిగిలిన మానసిక వికలాంగురాలు మేఘనకు ప్రభుత్వం ప్రాథమిక సాయం అందించింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ స్వయంగా ఆమెకు రూ.10 లక్షల ఆర్థిక సాయం చెక్కును అందజేసి, ఎల్లవేళలా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ ఘటనలో తండ్రిని గతంలోనే, ఇప్పుడు తల్లి, చెల్లి, నానమ్మను కోల్పోయిన మేఘన పూర్తిగా అనాథ అయ్యిందని ఆమె బాబాయ్, చిన్నమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు రాజ్‌కుమార్ కళ్ల ముందే కుటుంబ సభ్యులను చంపడాన్ని చూసిన బాలిక తీవ్ర భయాందోళనలతో కొట్టుమిట్టాడుతోందని, రాత్రిపూట వారిని అడుగుతూ కన్నీరు కారుస్తోందని తెలిపారు.
మేఘన భవిష్యత్తు కోసం కలెక్టర్ సూచించిన మూడు ప్రభుత్వ పునరావాస కేంద్రాలలో సికింద్రాబాద్‌లోని కేంద్రాన్ని ఎంచుకున్నట్లు బంధువులు వెల్లడించారు. ఇంటి కార్యక్రమాలు పూర్తయ్యాక ఆమెను అక్కడ చేర్పిస్తామని, జీవితకాలం పాటు అవసరమైన సదుపాయాలు ప్రభుత్వమే కల్పిస్తుందని కలెక్టర్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
అయితే, ఈ ఘోరానికి కారణం పోలీసుల నిర్లక్ష్యమేనని బాధితుల కుటుంబ సభ్యులు మండిపడ్డారు. గతంలోనే నిందితుడు రాజ్‌కుమార్‌పై బాలల లైంగిక నేరాల చట్టం (POCSO) కింద ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, సరైన పెట్రోలింగ్ లేకపోవడంతోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని ఆరోపించారు. నిందితుడికి పోలీసులు సహకరించారనే అనుమానం ఉందని, ఇప్పటికైనా న్యాయం చేసి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.




