మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ జ్యోతి సింగ్ విచారణ చేపట్టారు. ఆయన అనుమతి లేకుండా ఎవరూ కూడా వ్యాపార ప్రయోజనాల కోసం లేదా వ్యక్తిగత లాభాల కోసం యువరాజ్ పేరు, చిత్రం, వాయిస్ లేదా ఆయనకు సంబంధించిన గుర్తింపులను ఉపయోగించకూడదని కోర్టు స్పష్టం చేసింది.
సోషల్ మీడియాలో AI సాంకేతికతను వాడుతూ యువరాజ్ సింగ్‌కు సంబంధించి అనుచితమైన ఫోటోలు, వీడియోలను కొందరు సృష్టిస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. మతపరమైన భావాలను దెబ్బతీసేలా లేదా ఇతర క్రీడాకారులతో గొడవపడుతున్నట్లుగా తప్పుడు కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల యువరాజ్ ఎన్నో ఏళ్లుగా సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలకు భంగం కలుగుతోందని కోర్టు గుర్తించింది.
ఈ నేపథ్యంలో మెటా వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు వెంటనే వివాదాస్పద కంటెంట్‌ను తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. తన గుర్తింపు ద్వారా వచ్చే వ్యాపార ప్రయోజనాలపై కేవలం యువరాజ్ సింగ్‌కు మాత్రమే పూర్తి హక్కులు ఉంటాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. 17 ఏళ్ల పాటు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన యువరాజ్ సింగ్, దేశంలో అత్యంత గౌరవప్రదమైన క్రీడాకారులలో ఒకరని కోర్టు తన వ్యాఖ్యల్లో పేర్కొంది.
గతంలో కూడా ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్, సల్మాన్ ఖాన్, పవన్ కళ్యాణ్, అభిషేక్ శర్మ వంటి ప్రముఖులు తమ పర్సనాలిటీ రైట్స్ రక్షణ కోసం ఇదే తరహాలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి ఉపశమనం పొందారు. ఇప్పుడు యువరాజ్ సింగ్ విషయంలో కూడా కోర్టు అదే తరహాలో కఠినమైన మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.








