న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఒదేల కలయికలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం 'ది ప్యారడైజ్'. ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన 'ఏశనాగుల' పాట సోషల్ మీడియాలో మాస్ జాతరను మొదలుపెట్టింది. విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ సాంగ్ ఇండియా వ్యాప్తంగా యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది.
ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. తెలంగాణ జానపద శైలికి మోడ్రన్ మ్యూజికల్ టచ్‌ను జోడించి, పవర్‌ఫుల్ మాస్ బీట్స్‌తో ఆయన ఈ పాటను రూపొందించారు. కాసర్ల శ్యామ్ రాసిన పల్లెటూరి నేటివిటీ సాహిత్యం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రభా బంగారిగళ్ల, అద్దుల జంగిరెడ్డిల గాత్రం ఈ పాటకు మరింత జోష్‌ను ఇచ్చింది.
ఈ పాటలో నాని రస్టిక్ మాస్ అవతార్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకుంటున్నారు. గతంలో 'దసరా' సినిమాతో ఈ కాంబినేషన్ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు 'ది ప్యారడైజ్'లో నానిని అంతకుమించి విభిన్నమైన ప్రపంచంలో చూపించబోతున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం శ్రోతలు, నాని అభిమానులు ఈ పాటను సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో ఈ పాటలోని బీట్స్‌కు భారీ స్థాయిలో వీడియోలు రూపొందుతున్నాయి. వ్యూస్, లైక్స్, షేర్స్ పరంగా ఈ సాంగ్ శరవేగంగా దూసుకెళ్తోంది.








