మాజీ పోలీస్ అధికారి, వైసీపీ ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం వ్యవహారశైలి సొంత పార్టీలో కలకలం రేపుతోంది. 2019లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఏసురత్నంకు, పార్టీ అధినేత జగన్ గుంటూరు మిర్చియార్డు ఛైర్మన్‌గా రెండుసార్లు అవకాశం కల్పించి, ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన తీరు మారుతోందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్న ఏసురత్నం, కౌన్సిల్ సమావేశాల్లో అధికార పార్టీ నేతలతో సన్నిహితంగా ఉండటం, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను పొగడడం వంటివి పార్టీలో చర్చకు దారితీశాయి. నరసరావుపేట టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు వరికపూడిసెల ప్రాజెక్టు కోసం చేసిన కృషిని కొనియాడటంతో పాటు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు అద్భుతంగా ఉందని ఆయన ప్రశంసించారు.

పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీని ఇరుకున పెట్టాయి. వెల్దుర్తి మండలం గుండ్లపాడులో హత్యకు గురైన టీడీపీ నేత చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే బిల్లును మండలిలో వైసీపీ వ్యతిరేకించినా, ఏసురత్నం మాత్రం దానికి మద్దతు ప్రకటించారు. పల్నాడు వాసిగా ఆ నిర్ణయం సమంజసమేనని ఆయన పేర్కొన్నారు.

తాజాగా జగన్ ఉత్తరాంధ్ర పర్యటనలో మహిళా ఎస్సైపై వైసీపీ నేతలు ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. ఈ ఘటనపై పార్టీ నేతలు వివరణ ఇస్తుండగా, ఏసురత్నం మాత్రం మహిళా ఎస్సైపై దాడి అమానుషమని తప్పుపట్టారు. మాజీ పోలీస్ అధికారిగా తాను పోలీసు శాఖకు సంఘీభావం తెలుపుతున్నానని చెప్పడం, వైసీపీ పెద్దల్లో అసహనానికి కారణమైంది. పార్టీ స్టాండ్ తెలుసుకోకుండా ఆయన తరచూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది.