బెంగళూరులోని యుఆర్‌రావు శాటిలైట్ సెంటర్ (URSC), తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) నుంచి సుమారు 100 మంది శాస్త్రవేత్తలు రాజీనామాలు చేశారు. వీరిలో గగన్‌యాన్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న కీలక సిబ్బంది కూడా ఉన్నారు. ఈ పరిణామంతో అప్రమత్తమైన కేంద్ర అంతరిక్ష విభాగం, రాజీనామాల నిబంధనలను మారుస్తూ గురువారం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది.

గగన్‌యాన్ సహా జాతీయ ప్రాముఖ్యత కలిగిన మిషన్లలో పనిచేస్తున్న గ్రూప్- ఏ శాస్త్రవేత్తలు, సాంకేతిక సిబ్బంది ఇచ్చే రాజీనామాలు లేదా స్వచ్ఛంద పదవీ విరమణ అభ్యర్థనలను యథావిధిగా ఆమోదించవద్దని కేంద్రం స్పష్టం చేసింది. గతంలో ఈ కేంద్రాల డైరెక్టర్లకు ఉన్న రాజీనామాలు ఆమోదించే అధికారాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఇకపై శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల రాజీనామాలను డైరెక్టర్ల సిఫార్సులతో సహా అంతరిక్ష విభాగానికి పంపాల్సి ఉంటుంది.

ఇస్రో శాస్త్రవేత్తలు రాజీనామా చేసి అంతరిక్ష రంగంలోని స్టార్టప్‌లలో చేరుతున్నట్లు సమాచారం. 2020లో ప్రైవేట్ సంస్థలకు అనుమతి ఇవ్వడం, 2023లో భారత అంతరిక్ష విధానాన్ని తీసుకురావడంతో దేశంలో ప్రస్తుతం 400కు పైగా స్టార్టప్‌లు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. పిక్సెల్, ధ్రువ స్పేస్, స్కైరూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోస్, బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ వంటి కంపెనీలు ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి.

ప్రస్తుతం ఈ అంతరిక్ష స్టార్టప్‌లు 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులను పొందాయి. 2025 నాటికి వీటికి అదనంగా 150 మిలియన్ డాలర్ల నిధులు సమకూరనున్నాయి. ఉద్యోగుల రాజీనామాల వల్ల కీలక ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసిన ప్రభుత్వం, ఈ నియామక ప్రక్రియను నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది.