నాగ్‌పూర్‌కు చెందిన విద్యార్థి అబ్దుల్లా తాలీబ్‌కు నేడు ఆదివారం నిర్వహించబడుతున్న నీట్ యుజి రీ ఎగ్జామ్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబూధాబిలో పరీక్షా కేంద్రం కేటాయించబడింది. సక్రమ రీతిలో పరీక్ష నిర్వహణను జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (ఎన్‌టిఎ) బాధ్యతగా తీసుకున్నప్పటికీ, ఈ విద్యార్థికి స్థానిక కేంద్రం దక్కలేదు.
విద్యార్థి తండ్రి డాక్టర్ మెహమ్మద్ తాలీబ్ మాట్లాడుతూ, తమ కుమారుడు పరీక్షకు నాగ్‌పూర్, వార్థా లేదా భాందారా కేంద్రాలలో ఏదో ఒకదాన్ని కోరాడని తెలిపారు. అయితే హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు అబూధాబి సెంటర్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఇదొక పెద్ద పరీక్ష అయినా తమ అబ్బాయికి అబూధాబి సెంటర్ ఎందుకు వేశారనే విషయం అర్థం కావడం లేదని వారు వాపోయారు.
ఈ విషయాన్ని వెంటనే పరీక్షల నిర్వహణ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, తరువాత సర్దుబాటు చేస్తామని వారు చెప్పినట్లు డాక్టర్ మెహమ్మద్ తాలీబ్ వివరించారు. అయినప్పటికీ తమకు ఆందోళన మాత్రమే మిగిలిందని కుటుంబ సభ్యులు విమర్శించారు.
ఈ ఘటనపై ఎన్‌టిఎ స్పందిస్తూ, అభ్యర్థి స్వయంగా అబూధాబి సెంటర్‌ను కోరారని, ఇప్పుడు కాదంటున్నారని పేర్కొంది. అయినప్పటికీ వెంటనే ఆ విద్యార్థి పరీక్షా కేంద్రాన్ని మార్చినట్లు అధికారులు తెలిపారు.








