సినిమా రంగంలో విజయం సాధించినా ఆర్థిక క్రమశిక్షణ లోపించడం వల్ల పలువురు నటులు చివరికి ఆర్థికంగా దెబ్బతిన్నారని మురళీమోహన్ అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, కేవలం నటనా ప్రతిభ మాత్రమే సరిపోదని, పెట్టుబడులు, ఖర్చులపై అవగాహన అత్యవసరమని హితవు పలికారు. ఈ విషయంలో కాంతారావు, హరనాథ్, రాజబాబు, పద్మనాభం వంటి వారి పరిస్థితులను ఉదాహరణలుగా చూపారు.
హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించిన కాంతారావు, నిర్మాతగా మారిన తర్వాత సరైన బడ్జెట్ నియంత్రణ లేకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని మురళీమోహన్ గుర్తుచేశారు. అలాగే రాజబాబు తన పరిమితులకు మించి పెద్ద పాత్రలు పోషించడానికి యత్నించడం, స్వంత చిత్రాలు నిర్మించడం వల్ల విజయం సాధించలేకపోయారని తెలిపారు. అద్భుతమైన కెరీర్ ఉన్నా పద్మనాభం సరైన ఆర్థిక ప్రణాళిక లేక కష్టాలు పడ్డారని, రజినీకాంత్ లాంటి వారు సహాయం చేయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
సినిమా విజయం ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుందని, కాబట్టి నిర్మాణ దశలో ఖర్చులు, రిస్క్‌లపై స్పష్టమైన లెక్కలు ఉండాలని మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో తన సోదరుడు కిషోర్ పాత్రను ఆయన ప్రశంసించారు. బడ్జెట్ కేటాయింపు, స్క్రిప్ట్ ఎంపిక, నటీనటుల నియామకంలో కిషోర్ కఠినమైన నియమాలు పాటించేవారని, దీనివల్ల వ్యర్థ ఖర్చులు జరగలేదని తెలిపారు.
కిషోర్‌ను 'పాపాల భైరవుడు' అని పిలిచేవారని, కానీ ఆ కఠినత్వం వల్లనే తాము ఆర్థికంగా సురక్షితంగా ఉండగలిగామని మురళీమోహన్ చెప్పారు. ఒక పాత్రకు ముగ్గురు నటీనటుల పేర్లు సూచించి, వారి పారితోషికం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అనవసర ఖర్చులు తగ్గించేవారని వివరించారు. సినిమా ప్రారంభ తేదీ నుంచి వంద రోజుల్లో విడుదలయ్యేలా పక్కా ప్లానింగ్ చేసుకునేవారని ఆయన గుర్తుచేశారు.
తన కెరీర్ ఆరంభంలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన 'భారతంలో ఒక అమ్మాయి' చిత్రంలో కాంతారావు, సావిత్రిలతో కలిసి పనిచేసిన అనుభవాలను కూడా మురళీమోహన్ పంచుకున్నారు. ఆ అనుభవాలు తమకు ఎన్నో పాఠాలు నేర్పాయని, ముఖ్యంగా కిషోర్ నిర్వహణా శైలి తమ విజయానికి కీలకమైందని ఆయన తెలిపారు.








