హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బగాయత్ ప్రాంతంలో రాత్రి సమయంలో ఒంటరిగా తిరుగుతున్న 56 ఏళ్ల బుడిగ స్వాతిని పోలీసులు గమనించారు. ఆమెను విచారించగా, నాగోల్‌లోని మమతా నగర్‌కు చెందిన ఆమె కుటుంబ కలహాల కారణంగా ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయినట్లు తెలిసింది. తీవ్ర మనస్తాపంతో ఇంటికి తిరిగి వెళ్లాలా వద్దా అనే అయోమయంలో ఆమె ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే స్వాతి వివరాలు సేకరించి, సిస్టమ్‌లో పరిశీలించగా నాగోల్ పోలీస్ స్టేషన్‌లో ఆమె గల్లంతైనట్లు మిస్సింగ్ కేసు నమోదు అయినట్లు ధ్రువీకరించారు. దీంతో సంబంధిత పోలీస్ స్టేషన్‌తో సమన్వయం చేసుకుని, తక్షణమే స్వాతి కుటుంబ సభ్యులను సంప్రదించారు. ఈ వేగవంతమైన చర్యల ఫలితంగా ఆమెను క్షేమంగా వారికి అప్పగించగలిగారు.

ఈ ఘటనలో చొరవ చూపిన కానిస్టేబుళ్లు శివకృష్ణ, మోహన్‌ల మానవత్వాన్ని స్వాతి కుటుంబ సభ్యులు ప్రశంసించారు. పోలీసుల అప్రమత్తత, తక్షణ స్పందనపై కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంఘటన స్థానికుల్లో పోలీసుల పట్ల మరింత భరోసా పెంచిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

కుటుంబ సమస్యల కారణంగా భావోద్వేగానికి లోనై ఇంటి నుంచి వెళ్లిపోయిన వారి విషయంలో ఆలస్యం చేయకుండా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కుటుంబ సభ్యులు పరస్పరం జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.