సూర్య, మమిత బైజు జంటగా నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ఇప్పటికే వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ చిత్రంలో సూర్యకు బావ పాత్రలో కనిపించిన సునీల్ రెడ్డి తన నటనతో ప్రేక్షకులను అలరించారు.

సునీల్ రెడ్డి తండ్రి కోదండ రామిరెడ్డి ఒకప్పటి స్టార్ దర్శకుడు. చిరంజీవి హీరోగా 'ఖైదీ', 'అభిలాష', 'పసివాడి ప్రాణం', 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు', 'ముఠామేస్త్రి' వంటి 20కి పైగా సినిమాలను కోదండ రామిరెడ్డి తెరకెక్కించారు. వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాల్లో 90 శాతం విజయవంతమయ్యాయి.

సునీల్ రెడ్డి 2018లో విజయ్ సేతుపతి 'సీతకత్తి' సినిమాతో నటనారంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత తమిళంలో 'డాక్టర్', 'బీస్ట్', 'జైలర్', 'మమన్నన్', 'పెరుసు' వంటి సినిమాల్లో నటించారు. తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ 'కిష్కింధపురి', 'కపుల్ ఫ్రెండ్లి' చిత్రాల్లో కూడా ఆయన భాగమయ్యారు.

ఈ సినిమాతో సునీల్ రెడ్డికి వచ్చిన గుర్తింపుతో తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కోదండ రామిరెడ్డి రెండో కుమారుడు, సునీల్ రెడ్డి తమ్ముడు వైభవ్ కూడా తమిళంలో హీరోగా, పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.