విశాఖపట్నం గాజువాక శ్రీనగర్‌కు చెందిన ఉడుముల రమేష్, దివ్య దంపతులు ఈ నెల 21న వరలక్ష్మీ వ్రతం నిర్వహించుకున్నారు. ఆనవాయితీ ప్రకారం మూడు రోజుల పాటు అమ్మవారికి 8 తులాల బంగారు ఆభరణాలను అలంకరించారు. పూజ ముగిసిన తర్వాత రమేష్ కేవలం 3 తులాల హారం, కాసు మాత్రమే తీసుకుని, మిగిలిన 5 తులాల ఆభరణాలను గమనించలేదు.
ఒక బ్రాస్లెట్, రెండు గొలుసులు, మూడు ఉంగరాలను పూజా సామాగ్రి, పువ్వులతో కలిపి ఎర్రటి వస్త్రంలో చుట్టారు. ఆ సామాగ్రిని దుర్గా నగర్ వద్ద ఉన్న స్టీల్ ప్లాంట్ రైల్వే బ్రిడ్జి కింద డ్రైనేజీ కాలువలో పారవేశారు. ఇంటికి వెళ్ళాక బంగారం కనిపించకపోవడంతో దివ్య గమనించి భర్తకు చెప్పగా, వారు వెంటనే కాలువ వద్దకు వెళ్లి వెతికినా ఫలితం లేకపోయింది.
దీంతో ఆందోళనకు గురైన దంపతులు స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సీఐ కేశవరావు, ఒక కానిస్టేబుల్ మరియు హోమ్ గార్డును ఘటనా స్థలానికి పంపించారు. జేసీబీ యంత్రం సాయంతో డ్రైనేజీ నీటి ప్రవాహాన్ని మళ్లించి, కాలువలో క్షుణ్ణంగా గాలింపు చేపట్టారు.
గాలింపులో కాలువలో చల్లచెదురుగా పడి ఉన్న ఆభరణాలు ఒక్కొక్కటిగా దొరికాయి. పోలీసులు ఆ బంగారాన్ని సురక్షితంగా తీసుకువచ్చి రమేష్, దివ్య దంపతులకు అప్పగించారు. తమ బంగారం తిరిగి దొరకడంతో ఆ కుటుంబం ఆనందం వ్యక్తం చేస్తూ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది.
పండుగలు, పూజల సమయంలో విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్టీల్ ప్లాంట్ సీఐ కేశవరావు ప్రజలకు సూచించారు. బంగారం సురక్షితంగా చేతికి అందడంతో ఈ ఘటన సుఖాంతమైంది.








