పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని శ్రీనగర్‌ కాలనీలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో భీమవరానికి చెందిన 26 ఏండ్ల హేమదుర్గ మృతి చెందారు. ర్యాపిడో బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది.

ఈ ప్రమాదం జరిగిన 24 గంటల్లోనే పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను విడుదల చేశారు. అంతేకాకుండా, ప్రమాదానికి కారణమనే ఆరోపణతో ఆర్టీసీ డ్రైవర్‌ షేక్‌ అన్వర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

అయితే, మాదాపూర్‌లోని ఇనార్బిట్‌ మాల్‌ వద్ద జరిగిన మరో ప్రమాదంపై నెటిజన్లు ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. జనసేన ఎంపీ లింగమనేని రమేశ్‌ కుమారుడు సంజుశ్‌ కారుతో ఢీకొనడంతో ఒక యువతి మరణించి నెల రోజులు గడుస్తోంది.

ఈ ఘటనలో నిందితుడైన సంజుశ్‌ను పోలీసులు కేవలం స్టేషన్‌కు పిలిపించి వదిలేశారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్‌కు ఒకలా, ఎంపీ కుమారుడికి మరోలా పోలీసులు వ్యవహరిస్తున్నారని వారు సోషల్‌ మీడియా వేదికగా మండిపడుతున్నారు.

పోలీసు శాఖ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని, బడాబాబులకు ఒక న్యాయం, సామాన్యులకు మరో న్యాయం అన్నట్లుగా వ్యవహరిస్తోందని నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.