విశాఖపట్నం సమీపంలోని గుడిలోవా విజ్ఞాన విహార్ పాఠశాలలో ఆగస్టు 19 నుంచి 21 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఆర్ఎస్ఎస్ సర్‌సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భగవత్, సర్‌కార్యవాహ్ దత్తాత్రేయ హోసబలే సహా మొత్తం 327 మంది ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొంటారు. ఇందులో 253 మంది పురుషులు, 49 మంది మహిళా ప్రతినిధులు ఉన్నారు.
దేశంలో మారుతున్న జనాభా నమూనాలు, యువతలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వ్యసనం వంటి అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. యువతను డ్రగ్స్ బారి నుంచి కాపాడేందుకు ప్రజల్లో అవగాహన కల్పించడం, సమాజంలోని వివిధ వర్గాలను భాగస్వాములను చేయడంపై కార్యాచరణ రూపొందించనున్నారు. అలాగే, ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా చేపట్టిన 'పంచ పరివర్తన్' అంటే సామాజిక సమరసత, పర్యావరణం, కుటుంబ విలువలు, పౌర కర్తవ్యాల వంటి ఐదు అంశాల పురోగతిని సమీక్షించనున్నారు.
ఈ సమావేశం ఎలాంటి కార్యనిర్వాహక నిర్ణయాలు తీసుకునే వేదిక కాదని ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ స్పష్టం చేశారు. కేవలం వివిధ సంస్థల మధ్య సమన్వయాన్ని పెంచుకోవడం, సామాజిక సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలను వెతకడమే దీని ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. ఆర్థికాభివృద్ధి మాత్రమే కాకుండా సామాజిక, సాంస్కృతిక, విద్యా రంగాల్లో సమతుల్య పురోగతి సాధించేలా భారతీయ అభివృద్ధి నమూనాను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఆర్ఎస్ఎస్ పట్ల ప్రజల్లో ఆసక్తి పెరుగుతోందని, 'జాయిన్ ఆర్ఎస్ఎస్' వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకునే వారి సంఖ్య భారీగా పెరిగిందని అంబేకర్ వెల్లడించారు. 2026లో జనవరి నుంచి జూలై మధ్య కాలంలో 1,23,287 మంది నమోదు చేసుకోగా, వారిలో 85 శాతం మంది 40 ఏళ్లలోపు వారేనని ఆయన వివరించారు. ఈ సమావేశం 21వ తేదీ సాయంత్రంతో ముగియనుంది.








