1999లో 'ప్రేమకథ' చిత్రంతో టాలీవుడ్ ప్రవేశం చేసిన సుమంత్, ప్రస్తుతం తన రెండో ఇన్నింగ్స్‌లో విభిన్న పాత్రలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఇటీవల టీవీ9 పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన, తన కెరీర్ భవిష్యత్తు గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తన మేనల్లుళ్లు నాగ చైతన్య, అఖిల్‌లతో ఉన్న అనుబంధం గురించి సుమంత్ మాట్లాడుతూ, తాము కలిసినప్పుడు సినిమాల గురించి పెద్దగా చర్చించుకోమని స్పష్టం చేశారు. ఇతర కుటుంబాల మాదిరిగానే తాము కూడా వెకేషన్లు, వ్యక్తిగత జీవితంలోని సాధారణ విషయాల గురించి సరదాగా మాట్లాడుకుంటామని ఆయన తెలిపారు.
కెరీర్ పరంగా కొత్త జానర్లలో నటించేందుకు సిద్ధంగా ఉన్నానని సుమంత్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఒక హారర్ చిత్రంలో నటించాలనే కోరిక ఉందని, అలాగే లాజిక్ లేని పూర్తి స్థాయి కామెడీ చిత్రాల్లో కూడా నటించాలని ఉందని ఆయన తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. విలన్ పాత్రలు చేసేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.







