దేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చడం సప్తధారలో మొదటి లక్ష్యం. తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఉత్పత్తులను భారీగా తయారు చేయడం ద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలని, ప్యాకేజింగ్ మరియు కచ్చితత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలని ఉత్పత్తిదారులకు ప్రధాని సూచించారు.
వ్యవసాయ రంగంలో కేవలం పంటలు పండించడమే కాకుండా, వాటిని ప్రాసెసింగ్ చేసి ఎగుమతి చేయడంపై దృష్టి పెట్టాలని మోదీ కోరారు. దీనివల్ల రైతులకు మెరుగైన ఆదాయం లభిస్తుందని, మిల్లెట్స్, సుగంధ ద్రవ్యాలు, పండ్లు, కూరగాయలు అంతర్జాతీయ బ్రాండ్లుగా ఎదగాలని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి ఆధునిక సాంకేతికతలను భారత్‌లోనే అభివృద్ధి చేయాలని, యూపీఐ (UPI) తరహాలో డిజిటల్ రంగంలో మరిన్ని విజయాలు సాధించాలని ప్రధాని పిలుపునిచ్చారు.
మౌలిక వసతుల కల్పన కోసం గతిశక్తి పథకం ద్వారా రోడ్లు, రైల్వేలు, పోర్టులు, విమానాశ్రయాల అనుసంధానాన్ని పెంచుతామని మోదీ తెలిపారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు ఆయుధాల తయారీని పెంచి, డ్రోన్ సాంకేతికతపై పెట్టుబడులు పెట్టడం ద్వారా విదేశీ దిగుమతులను తగ్గించుకుంటామని ఆయన చెప్పారు.
చివరగా, పర్యావరణహితమైన గ్రీన్ ఎకానమీ, సముద్ర వనరుల వినియోగంతో కూడిన బ్లూ ఎకానమీకి ప్రాధాన్యం ఇస్తామని ప్రధాని వెల్లడించారు. భారతదేశ సంస్కృతి, యోగా, పర్యాటకం వంటి అంశాలను సాఫ్ట్ పవర్ (సాంస్కృతిక, దౌత్యపరమైన ప్రభావం)గా ఉపయోగించుకుని ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రభావాన్ని మరింత పెంచుతామని ఆయన స్పష్టం చేశారు.







