విజయవాడలోని సత్యనారాయణపురంలో మాషా అల్లా ఎంటర్ప్రజెస్ పేరుతో పసుపులేటి అంకుశం అనే వ్యక్తి ఒక కంపెనీని ప్రారంభించాడు. వంటింట్లో వాడే స్క్రబ్బర్ ప్యాడ్లను తయారు చేసే కాంట్రాక్టు ఇస్తామని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చని సోషల్ మీడియా వేదికలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో విస్తృతంగా ప్రచారం చేశాడు. ముడి సరుకును తామే సరఫరా చేస్తామని, తయారైన ఉత్పత్తులను ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తామని నమ్మబలికాడు.

ఈ ప్రచారాన్ని నమ్మి వందల మంది బాధితులు కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఒక్కో వ్యక్తి నుంచి మిషన్ల కోసం రూ.30 వేలు, ముడి సరుకు కోసం అదనంగా రూ. లక్ష వసూలు చేశాడు. ఇలా పెట్టుబడిదారుల నుంచి రూ. లక్ష నుంచి రూ. పది లక్షల వరకు సేకరించి, వారికి నకిలీ బాండ్ పేపర్లను ఇచ్చాడు. స్క్రబ్బర్ ప్యాడ్లు తయారు చేసి ఇస్తే నెలకు రూ. లక్షా 20 వేల ఆదాయం వస్తుందని ఆశ చూపాడు.

నమ్మకం కలిగించేందుకు మొదటి మూడు నెలల పాటు బాధితుల ఖాతాల్లో కొంత మొత్తాన్ని జమ చేశాడు. అయితే, గత రెండు నెలలుగా స్క్రబ్బర్ ప్యాడ్లను తీసుకోవడం నిలిపివేసి, భారీగా డబ్బులు చేతికి అందగానే అంకుశం పరారయ్యాడు. కోట్లలో డబ్బులు పోగొట్టుకున్న బాధితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించారు.