విమానయాన సంస్థలు తమ విమానాలను నడిపే షెడ్యూల్డ్ కమర్షియల్ ఫ్లైట్ (నిర్ణీత సమయానికి నడిచే వాణిజ్య విమానం) సేవలు సోమవారం ఉదయం నుంచి అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో 6E 6408 విమానం ఉదయం 6:44 గంటలకు భోగాపురం విమానాశ్రయంలో దిగింది. ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తొలి ప్రయాణికులకు స్వాగతం పలికారు.
అధికారికంగా ఆదివారం అర్ధరాత్రి నుంచే విమాన సర్వీసుల సందడి మొదలైంది. స్కూట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం భోగాపురం నుంచి సింగపూర్‌కు బయలుదేరడంతో అంతర్జాతీయ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఒక్కరోజే మొత్తం 31 విమానాలు రాకపోకలు సాగించనుండగా, వీటి ద్వారా సుమారు 6 నుంచి 7 వేల మంది ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉంది.
భోగాపురం నుంచి హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, తిరుపతి, చెన్నై, కోల్‌కతా, ముంబై వంటి నగరాలకు విమాన సౌకర్యం అందుబాటులో ఉంటుంది. సింగపూర్, అబుధాబి వంటి అంతర్జాతీయ ప్రాంతాలకు కూడా విమానాలు నడుస్తాయి. విశాఖపట్నం నుంచి విమానాశ్రయానికి ప్రయాణికులు సులభంగా చేరుకునేందుకు 20 విద్యుత్తు బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు మరియు ఉపాధి అవకాశాలను పెంచుతుందని అధికారులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సర్వీసులతో ఈ విమానాశ్రయం కీలకమైన ఏవియేషన్ హబ్ (విమానయాన కేంద్రం)గా ఎదిగే అవకాశం ఉంది.








