కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంపై శనివారం జరిగిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఇది భారత విద్యార్థుల మరియు ప్రతిపక్షాల నుంచి వస్తున్న హెచ్చరిక అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు దేశాన్ని నడిపిన తీరులో ఇకపై సాగలేరని, ఈ దేశం భారత ప్రజలదని మరియు రాజ్యాంగబద్ధంగా నడవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.
భారత విద్యా వ్యవస్థను ఆర్ఎస్ఎస్ నాశనం చేసిందని రాహుల్ ఆరోపించారు. విద్యార్థులపై జరిగిన దాడులకు అమిత్ షా బాధ్యత వహించాలని, ప్రధాని మోదీ విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులపై దాడులను తాము అనుమతించబోమని, ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం వినాలని ఆయన కోరారు.
విద్యారంగంలో మంచి సంస్కరణలు రావాలని, విద్యా వ్యవస్థను బీజేపీ భ్రష్ఠు పట్టించిందని రాహుల్ విమర్శించారు. విద్యా రంగాన్ని క్రమంగా ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. విద్యార్థులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని, వారికి రక్షణగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
ఇదే ధోరణిలో ప్రభుత్వం ముందుకు సాగితే, ఇప్పుడు జరిగిన దానికంటే పది రెట్లు పెద్ద స్థాయిలో పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని రాహుల్ హెచ్చరించారు. పేపర్ లీకులపై తీసుకొచ్చే బిల్లుల విషయంలో విపక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.








