దమ్మపేట మండలం అంకంపాలెంలోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ బాలికల పాఠశాలలో పాఠశాల స్థాయి క్విజ్ పోటీలను శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐటీడీఏ పీవో బి.రాహుల్ మాట్లాడుతూ, ఇటువంటి పోటీలు విద్యార్థుల్లోని మేధాశక్తిని, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు.
గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదేశాల మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ పోటీలను ఏర్పాటు చేశారు. ప్రతి పాఠశాల నుంచి నలుగురు విద్యార్థులను ఎంపిక చేసి, తదుపరి స్థాయి పోటీలకు పంపనున్నట్లు ఆయన వివరించారు.
ఈ నెల 11న ఏటీడీవోల పరిధిలో ఎంపికలు జరుగుతాయి. అక్కడ ప్రతిభ చూపిన విద్యార్థులు ఈ నెల 13న ఐటీడీఏ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారు. ఐటీడీఏ స్థాయిలో విజేతలుగా నిలిచిన పాఠశాలలకు అభివృద్ధి పనుల కోసం నగదు పురస్కారాలను అందజేయనున్నట్లు పీవో తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, దమ్మపేట తాసీల్దార్ మురళి, ఏటీడీవో చంద్రమోహన్, హెచ్ఎం శారద, డిప్యూటీ వార్డెన్ నాగమణి మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.








