ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ఫలితంగా కళాశాలలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. నిజాం కాలేజీ, కోఠి ఉమెన్స్ కాలేజీ, సైఫాబాద్ సైన్స్ కాలేజీ, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలతో పాటు పలు అటానమస్ కళాశాలల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే బకాయిలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను వినేందుకు ప్రత్యేకంగా టోల్-ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయాలని, సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న కళాశాలల ప్రిన్సిపాళ్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ఈ మేరకు గవర్నర్, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మరియు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) చైర్మన్‌కు దాసోజు శ్రవణ్ వినతిపత్రాలు సమర్పించారు. ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.