నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు మంగళవారం వెల్లడించారు. భారీ పల్నొనరీ ఎంబోలిజంతో షాక్‌కు గురై ఆయన గుండెపోటుకు లోనయ్యారు. దీనివల్ల ఆయన వరంగల్‌లోని రోహిణి ఆస్పత్రిలో చేరగా, అక్కడ వైద్యులు సీపీఆర్ (CPR) మరియు ఏసీఎల్ఎస్ (ACLS) నిర్వహించి సుమారు 45 నిమిషాల తర్వాత గుండె స్పందనను పునరుద్ధరించారు. అక్కడ థ్రాంబోలైసిస్ చికిత్స అందించిన అనంతరం, ఆయనను మెరుగైన వైద్యం కోసం యశోదా ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి అడ్వాన్స్‌డ్ క్రిటికల్ కేర్ యూనిట్‌లో నిపుణుల బృందం పర్యవేక్షణలో ఉన్నారు. తక్కువ మోతాదులో మందుల సాయంతో ఆయన రక్తపోటు, ఇతర కీలక అవయవాల పనితీరు నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే, ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆయన మాటలకు లేదా నొప్పి ఉద్దీపనలకు ఎటువంటి న్యూరాలజికల్ స్పందన చూపడం లేదని పేర్కొన్నారు.

ఈ క్రమంలో నిర్వహించిన ఈఈజీ (EEG), ఎంఆర్ఐ (MRI) బ్రెయిన్, సీటీ స్కాన్ పరీక్షల్లో మెదడుకు ఆక్సిజన్ లోపం (Anoxic Brain Damage) ఉన్నట్లు లక్షణాలు కనిపించాయి. ఈ నేపథ్యంలో జూలై 29, బుధవారం నాడు 72 గంటల న్యూరాలజికల్ రీ-అసెస్‌మెంట్ నిర్వహించనున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ పరీక్షల అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. చికిత్సకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నట్లు ఆస్పత్రి అధికారులు వెల్లడించారు.