వర్షాకాలంలో విద్యుత్ స్తంభాలు, స్టే వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ వైర్లు ఉన్న తడి గోడలకు దూరంగా ఉండాలని జగిత్యాల TGNPDCL సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ బి. సుదర్శనం సూచించారు. తెగిపడిన లేదా వేలాడుతున్న విద్యుత్ తీగలను తాకవద్దని ఆయన స్పష్టం చేశారు.
ఇంట్లో స్విచ్‌లు, మీటర్లు, గీజర్లు లేదా వాటర్ హీటర్లను తడి చేతులతో ఆపరేట్ చేయకూడదని అధికారులు హెచ్చరించారు. గృహ అవసరాల కోసం నాణ్యమైన వైర్లను వాడటంతో పాటు, వైరింగ్‌కు సరైన ఎర్తింగ్ ఉండేలా చూసుకోవాలని సూచించారు. విద్యుత్ మరమ్మతుల కోసం సొంతంగా ప్రయత్నించకుండా, ధృవీకరించబడిన ఎలక్ట్రీషియన్‌ను మాత్రమే సంప్రదించాలని తెలిపారు.
ఒకవేళ ఎవరైనా విద్యుత్ షాక్‌కు గురైతే, బాధితులను నేరుగా తాకవద్దని సూచించారు. వెంటనే వైద్య సహాయం అందేలా చూడాలని కోరారు. చిన్నపాటి అజాగ్రత్త కూడా ప్రాణహాని కలిగిస్తుందని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.








