వర్షాకాలం మొదలవ్వడంతో చిరు జల్లులు పడుతున్నాయి. ఈ సమయంలో వేడివేడి బజ్జీలు తినడం ఎంతో మజాను ఇస్తుంది. ఎప్పుడూ తినే మిర్చి బజ్జీ, పకోడీలకు భిన్నంగా ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని పెంచే ఆకులు, కూరగాయలతో ఈ వెరైటీ బజ్జీలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

బీరకాయ బజ్జీల కోసం ముందుగా బీరకాయ తొక్క తీసి పలుచని గుండ్రటి ముక్కలుగా కోసుకోవాలి. ఒక గిన్నెలో శెనగపిండి, బియ్యప్పిండి, కారం, వాము, వంటసోడా వేసి జారుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో బీరకాయ ముక్కలను ముంచి కాగే నూనెలో వేసి వేయించుకుంటే రుచికరమైన బజ్జీలు సిద్ధమవుతాయి. వీటిని నేరుగా లేదా నచ్చిన చట్నీతో తీసుకోవచ్చు.

వామాకు బజ్జీలు గ్యాస్ సమస్యలు, అజీర్తి వంటి ఇబ్బందులకు మంచి ఔషధంగా పనిచేస్తాయి. శుభ్రం చేసిన వామాకులను శెనగపిండి, బియ్యప్పిండి, ఇంగువ, ఉప్పు, కారం, ధనియాల పొడి, వంటసోడాతో కలిపిన మిశ్రమంలో ముంచి నూనెలో డీప్ ఫ్రై చేయాలి. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే ఈ బజ్జీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

నాన్-వెజ్ ప్రియుల కోసం చికెన్ స్టఫ్డ్ మిర్చి బజ్జీలను తయారు చేయవచ్చు. ప్రెషర్ పాన్‌లో ఉల్లిపాయలు, చికెన్, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు వేసి ఉడికించుకోవాలి. మైదా పిండిని పూరీల్లా ఒత్తి సన్నని రిబ్బన్లుగా కట్ చేసి, చికెన్ మిశ్రమం నింపిన మిర్చికి చుట్టి నూనెలో వేయించాలి. ఈ బజ్జీలు రుచిగా ఉండటంతో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.