కర్ణాటకలోని కలబురిగిలో మీడియాతో మాట్లాడిన మల్లికార్జున ఖర్గే, బీజేపీ ప్రభుత్వం విభజన రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. వందేమాతరం గీతాన్ని రెండు చరణాలు మాత్రమే పాడాలన్న నిర్ణయం దేశ వ్యతిరేకమని, కాంగ్రెస్ ఓటు బ్యాంకు కోసం చట్టాన్ని ధిక్కరిస్తోందని అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు.

పండిట్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్ వంటి జాతీయ నేతలు 1937లోనే వందేమాతరం గీతాన్ని ఆరు చరణాల నుంచి రెండు చరణాలకు తగ్గించాలని నిర్ణయించారని ఖర్గే గుర్తుచేశారు. గత 90 ఏళ్లుగా దేశం ఇదే పద్ధతిని అనుసరిస్తోందని, ఇప్పుడు లేని సమస్యను బీజేపీ ఎందుకు సృష్టిస్తోందని ఆయన ప్రశ్నించారు.

నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరు చరణాలు ఎందుకు ఆలపించలేదని ఖర్గే నిలదీశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇన్నాళ్లు ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదని ఆయన ప్రశ్నించారు. అవసరమైనప్పుడల్లా కొత్త సమస్యలను తెరపైకి తేవడం బీజేపీకి అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ, సేవాదళ్ (కాంగ్రెస్ పార్టీకి చెందిన స్వచ్ఛంద విభాగం) ఎన్నో ఏళ్లుగా వందేమాతరం గీతాన్ని ఆలపిస్తున్నాయని ఖర్గే తెలిపారు. జనగణమన గీతం కూడా ఐదు చరణాలతో ఉండేదని, గేయ రచయిత రవీంద్రనాథ్ టాగోర్ ఆమోదంతోనే ఇప్పుడు ఒక చరణాన్ని మాత్రమే పాడుతున్నామని వివరించారు.

వందేమాతరంలో రెండు చరణాలు, జనగణమనలో ఒక చరణం పాడటానికి సమాన సమయం పడుతుందని ఆయన స్పష్టం చేశారు. జాతీయ నేతలు నిర్ణయించిన దానినే తాము పాటిస్తుంటే, తాము దేశద్రోహులమా అని ఆయన ఎదురుప్రశ్న వేశారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.