వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేఘారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వర్గాల మధ్య వివాదం ముదిరింది. గోపాలపేటలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారెడ్డి, తన సొంత పార్టీ ఎమ్మెల్యే మేఘారెడ్డిపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. వనపర్తిలో కాంగ్రెస్ పార్టీని అవినీతిమయంగా మార్చారని, అభివృద్ధి పనుల పేరుతో ఎమ్మెల్యే మేఘారెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు దక్కాల్సిన టికెట్‌ను కోట్లు ఇచ్చి మేఘారెడ్డి కొనుక్కున్నారని చిన్నారెడ్డి ఆరోపించారు. 48 ఏళ్ల తన రాజకీయ జీవితాన్ని ఒక్క వేటుతో పడేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి మేఘారెడ్డి అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపణలు చేశారు. తాను పార్టీలో తప్పులను భరిస్తున్నానని, లేదంటే మరో జీవన్ రెడ్డి పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు.

చిన్నారెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్గం తీవ్రంగా స్పందించింది. 8 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన చిన్నారెడ్డి, అన్నిసార్లు కలిపి ఎన్ని కోట్లు ఖర్చు చేశారో లెక్క చెప్పాలని వారు డిమాండ్ చేశారు. చిన్నారెడ్డి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ విపక్ష పార్టీ BRSకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే వర్గం ఆరోపించింది. ఈ వ్యవహారంపై పార్టీ క్రమశిక్షణ కమిటీతో పాటు, పీసీసీ (రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ), సీఎం, ఏఐసీసీ (అఖిల భారత కాంగ్రెస్ కమిటీ) పెద్దలకు ఫిర్యాదు చేస్తామని మేఘారెడ్డి తెలిపారు.

ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా తన పదవీ కాలం ముగుస్తుండటంతో, పదవిని మళ్లీ పొందేందుకే చిన్నారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కొందరు విశ్లేషిస్తున్నారు. వనపర్తి కాంగ్రెస్‌లో పెరిగిన ఈ వర్గపోరును పార్టీ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.