చైనాలోని హుబే ప్రావిన్స్‌, వూహాన్‌లో 48 ఏళ్ల డాంగ్‌ విన్‌ అనే మహిళ ఆవిరి మీద ఉడికించే స్టఫ్డ్‌ బన్‌ల (పిండి పదార్థంతో చేసిన ఆహారం) దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. గత మూడేళ్లుగా ఈ వ్యాపారాన్ని విజయవంతంగా నడుపుతున్న ఆమె, గత జూలైలో రెండో బ్రాంచ్‌ను కూడా ప్రారంభించారు.

1999లో వూహాన్ యూనివర్సిటీ నుంచి వైద్య విద్య పూర్తి చేసిన డాంగ్‌, గైనకాలజిస్ట్‌గా తన వృత్తిని ప్రారంభించారు. ఆ తర్వాత తన తల్లి ప్రైవేట్ క్లినిక్‌లో సహాయం చేసేందుకు వూహాన్‌కు తిరిగి వచ్చారు. తల్లి పదవీ విరమణ తర్వాత, ఆమె హుబేలోని టియాన్‌మెన్‌కు వెళ్లి డాక్టర్‌గా పనిచేయడంతో పాటు కమ్యూనిటీ న్యాయవాదిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.

వైద్యురాలిగా విధులు నిర్వహించడంతో పాటు ప్రభుత్వ ఏజెన్సీల తనిఖీలు, ఆసుపత్రికి సంబంధించిన న్యాయపరమైన కేసుల బాధ్యతలు ఆమెపై ఉండేవి. ఈ పనుల వల్ల విపరీతమైన మానసిక ఒత్తిడి, ఆందోళనకు గురైనట్లు ఆమె తెలిపారు. దీంతో 2023లో తన వైద్య వృత్తికి రాజీనామా చేశారు.

స్నేహితురాలి కుటుంబం నడిపే బన్‌ వ్యాపారంపై ఆసక్తితో ఆమె అందులో పెట్టుబడి పెట్టారు. అయితే అనుకోకుండా చెఫ్ రాజీనామా చేయడంతో, తానే స్వయంగా బన్‌ల తయారీని నేర్చుకుని ఆ పనిని ఆస్వాదించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ వ్యాపారంలో రోజుకు 10 గంటలకు పైగా పనిచేస్తున్నా, వైద్యురాలిగా ఉన్నప్పటి మానసిక ఒత్తిడి ఇప్పుడు లేదని ఆమె చెబుతున్నారు.

తన నిర్ణయాన్ని తల్లి, సోదరుడు స్వాగతించడమే కాకుండా దుకాణంలో సహాయం చేస్తున్నారని డాంగ్‌ తెలిపారు. ఇతరులు ఏమనుకుంటారనే దానితో సంబంధం లేకుండా, తనకు నచ్చిన జీవితాన్ని జీవిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. తాను శారీరకంగా కదలలేని స్థితికి చేరుకునే వరకు ఈ దుకాణాన్ని నడుపుతానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.